: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంతో లండన్ పర్యటనను అర్థాంతరంగా ముగించిన పాక్ ప్రధాని షరీఫ్!
పాకిస్థాన్‌లో రెండు రోజుల క్రితం ఉగ్రదాడి, ఆయిల్ ట్యాంకర్ ప్రమాదం నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ తన లండన్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన నిజానికి ఈ నెల 30న పాక్ చేరుకోవాల్సి ఉంది. అయితే వరుస ఘటనల నేపథ్యంలో పర్యటనను మధ్యలోనే ముగించుకున్న ఆయన ఆదివారమే పాక్ పయనమయ్యారు. ఇందుకు కారణం శుక్రవారం జరిగిన ఉగ్రదాడి, ఆయిల్ ట్యాంకర్ ప్రమాదాలేనని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 140 మంది మృతి చెందగా, వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని షరీఫ్, అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.