: గ్రాండ్ అలయన్స్ హిమాలయాల్లాంటిది.. నిగ్రహం పాటించండి.. కూటమి నేతలకు లాలూ తనయుడు తేజస్వి పిలుపు
గ్రాండ్ అలయన్స్ నేతలు సంయమనం పాటించాలని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సూచించారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో కూటమిలోని జేడీయూ, ఆర్జేడీ మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో స్పందించిన తేజస్వి యాదవ్.. మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించాలని కూటమి నేతలను కోరారు. గ్రాండ్ అలయన్స్‌ను హిమాలయాలతో పోల్చిన ఆయన ప్రకటనలు ఇచ్చే ముందు ఓసారి ఆలోచించాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో తేజస్వి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలపగా ఆర్జేడీ మాత్రం విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కోవింద్‌కు మద్దతు ఇచ్చి చారిత్రక తప్పిదం చేయవద్దంటూ నితీశ్ కుమార్‌ను ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటలు హద్దులు మీరుతున్నాయి. దీంతో స్పందించిన తేజస్వి యాదవ్ తాజాగా ఇరు పార్టీల నేతలు సంయమనం పాటించాల్సిందిగా కోరారు.