: మిమ్మల్ని గూండాలంటారు... ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తా: యూపీ బీజేపీ నేతకు ఝలక్కిచ్చిన పోలీసు అధికారిణి
బీజేపీ జిల్లా స్థాయి నేత లైసెన్స్ లేకుండా బైక్ పై వెళ్తూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేయడంతో, తిక్కరేగిన పోలీసధికారి అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ప్రమోద్ అనే జిల్లాస్థాయి నేత ద్విచక్రవాహనంపై వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనకు 200 రూపాయల జరిమానా విధించి చలానా రాశారు. దీంతో ఆయన తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్టు భావించి, మిగతా కార్యకర్తలతో కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే హక్కు లేదంటూ అరిచాడు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆయన హెచ్చరించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసు అధికారిణి శ్రేష్టా ఠాకూర్ దీటుగా స్పందించారు.
‘మీరు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపారు. మేము జరిమానాలు విధించడం మీకు నామోషీగా ఉంటే పోలీసులకు వాహనాలు తనిఖీ చేసే హక్కు లేదని సీఎం నుంచి అనుమతి తీసుకురండి. మేము రాత్రుళ్లు కుటుంబాన్ని వదిలి డ్యూటీకి వస్తాము. ఏదో సరదా కోసం కాదు. మీలాంటి వారే పార్టీలకు చెడ్డపేరు తెస్తారు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని భాజపా గూండాలని అంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తా’ అని వార్నింగ్ ఇచ్చారు.
దీనిని వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. పోలీసు అధికారిణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.