: రాజమౌళి ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యాను... ఆయనలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు : శ్రీదేవి


రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్ ను తన స్నేహితులు పంపితే దాన్ని చూసి షాక్ అయ్యానని, ఎంతో బాధపడ్డానని నటి శ్రీదేవి వ్యాఖ్యానించారు. తెలుగు టీవీ చానల్ 'ఎన్ టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని అన్నారు. తాను అంత అన్యాయంగా డిమాండ్ చేసినట్టు రాజమౌళి వ్యాఖ్యానించడం మనసుకు బాధ కలిగించిందని చెప్పారు.

ఆయనకు నిర్మాతలు తన గురించి తప్పుగా చెప్పారేమోనని కూడా అభిప్రాయపడ్డ శ్రీదేవి, "నేను ఎనిమిది కోట్లు, పది కోట్లు అడిగానట, ఆపై హోటల్ మొత్తం బుక్ చేయమన్నానట. పది ఫ్లయిట్ టికెట్లు అడిగానట. చూడండి, అట్లాంటి డిమాండ్ చేసుంటే 300 సినిమాలు చేసేదాన్నా, 50 సంవత్సరాలు నన్ను ఉండనిచ్చేవారు కాదు. ఎప్పుడో ప్యాక్ చేసి పంపుండేవారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ వంటి వారెందరో తమ సినిమాల్లో రిపీటెడ్ అవకాశాలు ఇచ్చారు. ఇటువంటివి విన్నప్పుడు యూ ఫీల్ బ్యాడ్. ఎందుకు ఇలా చెప్పాలి? ఒకవేళ ప్రొడ్యూసర్లు రాజమౌళి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పుంటారా? అన్న అనుమానాలు ఉన్నాయి.

కానీ, ఇలా అయ్యింది అని పబ్లిక్ ప్లాట్ ఫాంపై చెప్పడం, ఇలా మాట్లాడటం మంచి పద్ధతి అనిపించుకోదు. లింక్ లో రాజమౌళి ఇంటర్వ్యూ చూసి షాక్ అయి, బాధపడ్డాను. ఆయన ఓ చాలా కామ్, డిగ్నిఫైడ్ దర్శకులని అనుకున్నా. ఆయనతో కలసి పని చేయడం నాకు సంతోషమే. బట్, ఇలా మాట్లాడటం నాకు చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఇలా మాట్లాడి ఉండకూడదు" అని అన్నారు.

తన భర్త బోనీకపూర్ కూడా నిర్మాతేనని, నిర్మాతల కష్టాలు ఆయనకు తెలుసునని చెప్పిన శ్రీదేవి, ఆయన కూడా అటువంటి డిమాండ్లను చేసుంటారని అనుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి లేనిపోనివి చెప్పడం, నిజంగా మంచి పద్ధతి కాదు. అయినప్పటికీ, తాను రాజమౌళిని అభినందిస్తున్నానని, బాహుబలి లాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News