: ప్రియుడి కోసం కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయిన చిత్తూరు జిల్లా యువతి!
తాను ప్రేమించిన యువకుడి కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన చిత్తూరు జిల్లా యువతి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, వరదయ్యపాళెం మండలానికి చెందిన 20 ఏళ్ల యువతి ఓ కంపెనీలో పనిచేస్తుండగా, అక్కడే సెక్యూరిటీ విధుల్లో ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ (34)ను ప్రేమించింది. ఈ విషయాన్ని యువతి సోదరి గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో, ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే ఉంచారు. దీంతో తనను మరచిపోవాలని ఆమె సతీష్ కు చెప్పినప్పటికీ, సతీష్ వినకుండా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
దీంతో శనివారం నాడు తాను తల్లితో కలసి ఆసుపత్రికి వస్తున్నానని, అక్కడ వీలు చూసుకుని తనను కిడ్నాప్ చేయాలని చెప్పింది. దీంతో సతీష్ తన స్నేహితులతో కలసి కారు తీసుకుని యువతిని అపహరిస్తున్నట్టు నాటకం ఆడాడు. అది చూసిన స్థానికులు కొందరు తమ బైకులతో కలసి కారును వెంబడిస్తూ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బీఎన్ కండ్రిగ సమీపంలో కారును పోలీసులు నిలువరించి, వారిని అరెస్ట్ చేశారు. ఆపై తన ప్రియురాలి కోరిక మేరకే కిడ్నాప్ చేశానని చెబుతూ, ఆమె సెల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ లను చూపించడం, యువతి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పడంతో, ఆమెను వారికి అప్పగించి, సతీష్ ను హెచ్చరించి పంపారు.