: రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడ్డ చిన్నారి కోసం విశాఖపట్నంలో పూజలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో మొన్న సాయంత్రం 18 నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి విదితమే. ఆమెను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పాపను ఎప్పటికి బయటకు తీస్తారో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఈ దృశ్యాలను టీవీల ద్వారా చూస్తోన్న ప్రజలు చలించిపోతున్నారు. అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపినా ఆ పాప ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తాము తల్లడిల్లిపోతున్నామని విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం ఇందిరా కాలనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
వారంతా తమ గ్రామదేవతయిన దుర్గా అమ్మవారి గుడిలో పూజలు చేపట్టారు. చిన్నారులు, పెద్దలు దుర్గా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ఆ బాలిక సురక్షితంగా బోరుబావిలోంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. చిన్నపిల్ల ఇంతటి నరకాన్ని అనుభవించడం తమను ఎంతగానో బాధిస్తోందని ఆవేదన చెందారు. బోర్ వెల్స్ తవ్విన తరువాత నీరు పడకపోతే వాటిని వెంటనే మూసి వేయాలని వారు అంటున్నారు. మరోవైపు ఇక్కారెడ్డిగూడెంలోని బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, సిబ్బంది పాపను బయటకు తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.