: ప్రతిసారీ వైఫ్ బర్త్ డే అని తప్పించుకున్నా...ఈసారి దొరికిపోయినట్టున్నాను: కేటీఆర్
మంత్రి కేటీఆర్ హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల తాజ్ కృష్ణ హోటల్ లో భారతీ ఎయిర్ టెల్, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ ఎడిషన్ మారథాన్ పోటీల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మొదటి సారిగా 2014 మారథాన్ రన్ లో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా 5 కిలోమీటర్ల పరుగు పెట్టేస్తాననుకుని స్టార్ట్ చేశాను. సగం దూరం వెళ్లేసరికి నా పని అయిపోయింది. అందుకే రెండేళ్లుగా మారథాన్ పరుగులో పాల్గొనకుండా తప్పించుకుంటున్నాను. ప్రతి ఏటా ఆగస్టు చివరి వారంలో నిర్వహిస్తుండడంతో వైఫ్ బర్త్ డే అని చెబుతూ తప్పించుకున్నాను...ఈ సారి అలా జరగడం లేదు. మీరేమో మారథాన్ రన్ ను ముందుకి జరిపేశారు. ఈసారి దొరికిపోయినట్లే ఉన్నాను" అని కేటీఆర్ అనడంతో సభికులంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఆగస్టు 20న జరిగే ఈ రన్ లో తాను తప్పకుండా పరుగులు పెడతానని, ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. హైటెక్స్ వద్ద 10కె రన్ ప్రారంభమవుతుండగా, హాఫ్ మారథాన్ (21.095 కిలోమీటర్లు), ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగియనుందని ఆయన చెప్పారు.