: వైసీపీకి రోజా గుడ్ బై? పవన్ కల్యాణ్ వైపు అడుగులు వేస్తున్న ఫైర్ బ్రాండ్!
వైసీపీ అధినేత జగన్ వైఖరితో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా విసిగిపోయారా? వీలైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? అంటే ఔననే సమధానమే వినిపిస్తోంది. పలు విషయాలపై రోజాకు జగన్ క్లాస్ పీకారని, పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారనే వార్తలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే, విశాఖలో జగన్ నిర్వహించిన మహా ధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. జగన్ వైఖరి పట్ల రోజా ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మైలేజ్ కోసం తనను ఉపయోగించుకున్న జగన్... ఇప్పుడు అవసరం తీరిపోయాక, తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె భావిస్తున్నారు. తనకు, జగన్ కు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు పార్టీలో కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆమె విసిగిపోయారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, తనను మనస్తాపానికి గురి చేస్తున్నారని రోజా భావిస్తున్నారట. తనను కరివేపాకులా వాడుకున్న పార్టీలో కొనసాగడం రోజాకు చాలా ఇబ్బందికరంగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన రోజా అక్కడి నుంచే జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జబర్దస్త్ టీవీ షోలో తన కో-హోస్ట్ అయిన నాగబాబుతో కలసి ఈ మధ్యనే పవన్ కల్యాణ్ ను రోజా కలిశారట. పవన్ కూడా ఆమెకు సాదర స్వాగతం పలికారని తెలుస్తోంది. ఈ క్రమంలో, రోజా పార్టీ మారడం మాత్రమే ఆలస్యమని చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిన నిజమే! రోజా విషయంలో ఏం జరగబోతోందో కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.