: మోదీ అడుగుపెట్టకుండానే శుభవార్త వినిపించిన అమెరికా!


ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా అమెరికాలో అడుగుపెట్టకుండానే అమెరికా శుభవార్త వినిపించింది. 2 బిలియన్ డాలర్లతో ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కోసం ఈ పర్యటనను ప్రధాని వినియోగించుకోనున్నారన్న వార్తల నేపథ్యంలో... భారత్ కు 22 మానవ రహిత గార్డియన్‌ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపినట్లు అమెరికా అధికారులు సమాచారం పంపారని తెలుస్తోంది. అయితే భారత్ గతంలో ఒబామాతో చర్చలు జరిపిన సమయంలో ప్రిడేటర్ డ్రోన్లను నిఘా కోసం కోరింది. తాజాగా ట్రంప్ భారత్ తో బంధాన్ని బలపరుచుకునేందుకు గార్డియన్ డ్రోన్లను ఇస్తున్నట్టు వర్తమానం పంపింది.

 ప్రిడేటర్ డ్రోన్లను కేవలం నిఘా కోసం మాత్రమే వినియోగించే అవకాశం ఉంది. గార్డియన్ డ్రోన్లుగా వ్యవహరించే రేపర్ డ్రోన్లు కేవలం నిఘా కోసం మాత్రమే కాదు. మిసైల్స్ తో పాటు లేజర్ బాంబులను కూడా అవసరం మేరకు ప్రయోగించగలవు. అంతే కాకుండా గ్రౌండ్ నుంచి వీటిని నియంత్రించడం సులభం. భారత్ తో బంధాన్ని బలపరచడంతోపాటు రక్షణ రంగంలో మెరుగైన పర్యవేక్షణకు అమెరికా వీటిని అందజేయనుంది. శక్తిమంతమైన ఇంజన్ వ్యవస్థ, బలమైన రాడార్ సంబంధాలు, స్పష్టమైన విజువల్స్ తీయగల సామర్థ్యం గార్డియన్ డ్రోన్ల సొంతమని తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీ ఈ నెల 26న ట్రంప్ తో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News