: మంచినీరు తాగేందుకు 7 మంచి విధానాలు!


రోజుకి కనీసం 8 గ్లాసుల (సుమారు రెండు లీటర్లు) నీటిని తాగాల‌ని మ‌న‌కు తెలుసు. ఈ విష‌యాన్ని ప్రాచీన కాలంలో ఉన్న ఆయుర్వేద పుస్త‌కాల నుంచి ఇప్ప‌టి అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌లు కూడా వెల్ల‌డిస్తున్నాయి. కానీ ఎంత‌మంది దీన్ని పాటిస్తున్నారు? కొంత‌మంది 8 గ్లాసులు తాగాల‌ని తీర్మానించుకున్నా ఏదో ఒక కార‌ణంతో మ‌ధ్య‌లోనే మానేస్తున్నారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింది. అది కూడా ఆయుర్వేద పుస్త‌కాల్లోనే. లెక్క‌ప్ర‌కారం 8 గ్లాసులు తాగ‌క‌పోయినా, తీసుకున్న నీటి భాగంలో ఎక్కువ నీరు శ‌రీరానికి ఉపయోగ‌ప‌డేలా కొన్ని మెల‌కువ‌లు పాటిస్తే చాలు.

ఆ ఏడు అద్భుత‌మైన మెల‌కువ‌లివిగో....

1. కూర్చుని తాగండి: ప‌రిగెత్తి పాలు తాగ‌డం క‌న్నా నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం ఉత్త‌మం అనే సామెత‌ను దాని ఉచితార్థంలో కంటే మంచినీరు తాగే విష‌యంలో మాత్రం బాగా అమ‌లుచేస్తారు. కానీ అలా చేయ‌డం కంటే కూర్చుని నీళ్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అన్ని భాగాలకు, క‌ణాల‌కు, కండ‌రాల‌కు నీరు స‌మంగా అందుతుంది. మూత్ర‌పిండాలు కూడా కూర్చుని తాగిన‌పుడు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయి. నిల‌బ‌డి తాగిన‌పుడు ఎక్కువ శాతం నీరు ఎముక‌ల కీళ్ల‌లో చేరిపోయి ఆర్థరైటిస్ క‌లిగించే ప్ర‌మాదం ఉంది.

2. మొత్తం ఒకేసారి వ‌ద్దు: అలాగే రోజులో తాగాల్సిన మొత్తం నీటిని ఒకేసారి తాగ‌డం మంచిది కాదు. అలాగే నీళ్లు తాగుతున్న‌పుడు కూడా ఒకేసారి కాకుండా కొంచం కొంచంగా తాగాలి. అన్నం తినేట‌పుడు కూడా ఇలాగే తాగాలి. ఆయుర్వేదం ప్ర‌కారం శ‌రీరంలో పిత్తం, వాతం, క‌ఫం అనే మూడు దోషాలు ఉంటాయి. మీరు తాగే మంచినీళ్ల విధానం కూడా ఈ లోపాల‌కు అనుగుణంగా ఉండాలి. వాతం స‌మ‌స్య ఉన్న‌వారు భోజ‌నం చేసిన గంట త‌ర్వాత మంచి నీళ్లు తాగాలి, అలాగే పిత్తం స‌మ‌స్య ఉన్న‌వారు అన్నం తింటున్న‌పుడు మ‌ధ్య‌లో కొద్దికొద్దిగా నీళ్లు తీసుకోవాలి. క‌ఫం ఉన్న‌వారు మాత్రం భోజ‌నానికి ముందే వీలైన‌న్ని ఎక్కువ మంచినీళ్లు తాగాలి. శ‌రీర బ‌రువు త‌గ్గ‌డంలో ఇది స‌హ‌క‌రిస్తుంది.

3. చ‌ల్ల‌ని నీరు వ‌ద్దు, వెచ్చ‌ని నీరు ముద్దు: ప‌ళ్లు బిగుసుకుపోయేలా ఉండే చ‌ల్ల‌ని నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు మంద‌గిస్తుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా కాకుండా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీరు, లేదా గోరు వెచ్చ‌గా ఉండే నీరు తాగడం వ‌ల్ల ర‌క్త‌నాళాల శుద్ధి, కొవ్వు ప‌దార్థాల తొల‌గింపు జ‌రుగుతాయి.

4. దాహంగా ఉన్న‌పుడే తాగండి: మనం రోజులో తాగాల్సిన మొత్తం నీరు ల‌క్ష్యాన్ని చేర‌డానికి ఎప్పుడు ప‌డితే అప్పుడు నీరు తాగొద్దు. కేవ‌లం దాహం వేసిన‌పుడు మాత్ర‌మే అవ‌స‌ర‌మైనంత మేరకు మంచినీళ్లు తీసుకోవాలి.

5. శ‌రీరానికి నీటి అవ‌స‌రాన్ని గుర్తించండి: శ‌రీరంలో నీటి స్థాయి త‌క్కువైన‌పుడు ఆ స‌మ‌స్య‌ను గుర్తించ‌డానికి కొన్ని సంకేతాల‌ను పంపిస్తుంది. నీటి స్థాయి త‌క్కువైన‌పుడు మూత్రం ప‌సుపు రంగులో రావ‌డం, పెదాలు త‌డారిపోయి ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం జ‌రుగుతుంది. వీటిని గ‌మ‌నించి త‌గిన మోతాదులో మంచి నీరు తాగాలి.

6. ఉద‌యాన్నే మంచినీరు మంచిది: పొద్దున లేవ‌గానే మంచినీరు సేవించ‌డాన్ని ఆయుర్వేదంలో ఉషాప‌న అంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప‌ర‌మైన లాభాలున్నాయి. శ‌రీరంలో ఉన్న విష‌ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డానికి ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది.

7. రాగి లేదా వెండి పాత్ర‌లు ఉప‌యోగించండి: మంచినీళ్లు నిల్వ‌చేయ‌డానికి, తాగ‌డానికి గాజు, స్టీలు సామాగ్రికి బ‌దులుగా రాగి, వెండి పాత్ర‌లు ఉప‌యోగించ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలున్నాయి. రాగిలో ఉన్న వివిధ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి. అలాగే వెండిలో ఉండే స్వేచ్ఛాయుత ఎల‌క్ట్రాన్లు జీర్ణ‌క్రియ సులువుగా జ‌ర‌గ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

  • Loading...

More Telugu News