: సామర్లకోట లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు బాలికల మృతి
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఎస్ఆర్‌సీ లాడ్జిలో ఇద్దరు బాలికలు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరు బాలికలతో వారి తల్లిదండ్రులు లాడ్జిలోకి వచ్చారని అక్కడి సిబ్బంది తెలిపారు. ఆ దంపతులు విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన సత్యనారాయణ, గౌరమ్మలుగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి పూట ఆ బాలికలను లాడ్జిలోనే వదిలేసి వారి తల్లిదండ్రులు వెళ్లిపోయారని గుర్తించారు. ఈ రోజు ఉదయం ఆ గది తలుపులు తెరవగానే ఇద్దరు బాలికలు మృతి చెందినట్లు లాడ్జి సిబ్బంది గుర్తించారని పోలీసులు తెలిపారు. వారు ఎలా మృతి చెందారన్న విషయం తెలియాల్సి ఉంది.