: మరో ఎనిమిది భాషల్లో 'స్విఫ్ట్‌కీ' సేవలు!
మైక్రోసాఫ్ట్ వారి టైపింగ్ అప్లికేషన్ స్విఫ్ట్‌కీ తమిళ్‌తో పాటు మరో ఏడు భారతీయ భాషల్లో ట్రాన్స్‌లిటరేషన్ (ఉచ్చారణ ఆధారంగా ఇంగ్లీష్ నుంచి ఇతర భాషల్లోకి అనువాదం) సేవలు అందించనుంది. ఇప్పటికే ఈ అప్లికేషన్ ద్వారా హిందీ, గుజరాతీ భాషల్లో అధికారికంగా ట్రాన్స్‌లిటరేషన్ అందుబాటులో ఉంది. వీటితో పాటు తమిళ్, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తెలుగు భాషలకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. దీని సహాయంతో స్థానిక భాషతో పాటు మధ్య మధ్యలో ఇంగ్లిషు పదాలు ఉపయోగించే అవకాశం ఉంటుంది. `247 అక్షరాలు ఉన్న తమిళ భాషకు ట్రాన్స్‌లిటరేషన్ కీ బోర్డ్ రూపొందించడం చాలా కష్టమైన పని. దాన్ని మేం పూర్తిచేశాం. ఈ సదుపాయం వల్ల స్థానిక భాషలో సమాచారం పంపించుకునే వీలు కలుగుతుంది` అని స్విఫ్ట్‌కీ ప్రతినిధి ఆర్తి సమానీ అన్నారు.
ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా ఎక్కువ మంది భారతీయులు ఉపయోగించే ఎమోజీల వివరాలను స్విఫ్ట్‌కీ వెల్లడించింది. ఉత్తర భారతీయులు ఫేస్ బ్లోయింగ్ కిస్, దక్షిణ భారతీయులు పార్టీ పాపర్, తూర్పు ప్రాంతం వారు బికినీ ఎమోజీ, పశ్చిమం వారు బొకే, మధ్య ప్రాంత భారతీయులు గులాబి పువ్వు ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తారని వివరించారు. గతేడాది నవంబర్ నుంచి స్విఫ్ట్‌కీ సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చాయి.