: మా కొడుకు చాలా మంచోడు: బ‌్యూటీషియ‌న్ శిరీష మృతి కేసు నిందితుడు శ్ర‌వ‌ణ్ త‌ల్లిదండ్రులు


హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన బ్యూటీషియ‌న్ శిరీష‌ మృతి కేసులో నిందితుడుగా ఉన్న త‌మ కుమారుడు శ్ర‌వ‌ణ్ చాలా మంచివాడ‌ని ఆయ‌న‌ త‌ల్లిదండ్రులు అన్నారు. రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామంలోని త‌మ ఇంట్లో నుంచి ఈ రోజు మీడియాతో శ్ర‌వ‌ణ్ తండ్రి మాట్లాడుతూ.. తాను ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ప‌నిచేస్తుంటాన‌ని చెప్పాడు. త‌మ కుమారుడు ఎంతో విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్నార‌ని అంద‌రూ అంటున్నార‌ని, త‌మ‌ది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం అని అన్నాడు. శిరీష ఆత్మ‌హ‌త్య‌తో శ్ర‌వ‌ణ్‌కు సంబంధం లేదని వ్యాఖ్యానించాడు.

త‌మ‌ కుమారుడిని ఇందులో ఇరికించారని శ్రవణ్ తండ్రి ఆరోపించాడు. శ్ర‌వ‌ణ్ త‌న పెద్ద కుమారుడ‌ని తెలిపాడు. పేప‌ర్ల‌లో, టీవీల్లో త‌న కుమారుడు మంచివాడు కాద‌ని చెబుతోంటే త‌న‌కు బాధ క‌లుగుతోంద‌ని, త‌న కుమారుడు ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని వాదించాడు. త‌మ ఇంటి నుంచే త‌న కుమారుడు ప్ర‌తిరోజు ప‌నికి వెళ్లేవాడని, త‌న ఇల్లు చూస్తేనే తాము మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిమ‌ని అర్థ‌మ‌వుతుంద‌ని అన్నాడు. త‌న కుమారుడు ఎంతో సంపాదించాడ‌ని, సెటిల్ మెంట్లు చేశాడ‌ని అంటున్నార‌ని, అవన్నీ అవాస్తవాలని తెలిపాడు. శ్ర‌వ‌ణ్ త‌ల్లి మాట్లాడుతూ.. త‌న కుమారుడికి ఏ పాపం తెలియ‌ద‌ని వ్యాఖ్యానించింది. ఆయ‌న‌ను ఈ కేసులో ఇరికించాల‌ని చూస్తున్నార‌ని, శిరీష మృతి ‌కేసుతో త‌న కుమారుడికి ఎటువంటి సంబంధం లేద‌ని చెప్పింది.    

  • Loading...

More Telugu News