: దెయ్యం ఆదేశించిందట.. కన్న కూతురి రెండు చెవులను కోసేశాడు.. ఆపై చంపేయబోయాడు!
ఢిల్లీలో ఓ వ్యక్తి తన కూతురి పట్ల విచిత్రంగా ప్రవర్తించి, ఆమెను తీవ్రగాయాలపాలు చేసి చంపేయబోయాడు. తాను ఇలా చేయడానికి కారణం దెయ్యమేనని మరింత విచిత్రంగా మాట్లాడాడు. వివరాలు చూస్తే.. ఢిల్లీకి చెందిన బహదూర్ అనే ఓ లారీ క్లీనర్‌కి ఆరుగురు సంతానం. ఇటీవల బహదూర్ పెద్ద కూతురు మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధలో వింతగా ప్రవర్తించాడు. తన కూతురు మృతి చెందిన నాటి నుంచి తనకు ఓ దెయ్యం కనిపిస్తోందని అంటున్నాడు. తన రెండో కూతుర్ని కూడా ఎత్తుకుపోతానని ఆ దెయ్యం బెదిరిస్తోందని వింతగా మాట్లాడుతున్నాడు.
నిన్న అర్ధరాత్రి తరువాత మద్యం సేవించి ఇంటికి వచ్చి తన చిన్న కూతురు నిద్రిస్తున్న సమయంలో మొదట ఓ చెవిని కోసేశాడు. ఆ చిన్నారి అరుపులు పెట్టడంతో అతడి భార్య లేచి చూసింది. చెవి నుంచి రక్తం కారుతూ ఆ పాప కనిపించింది. వెంటనే ఆ పాపని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చూసింది. అయితే, ఆమెను బహదూర్ అడ్డుకున్నాడు. అంతేకాదు, ఆమెను, మిగతా పిల్లల్ని ఓ గదిలోకి నెట్టేశాడు. అనంతరం తాళం వేసి తన చిన్న కుమార్తె రెండో చెవిని కూడా కోసేశాడు. ఆ ఇంట్లో అరుపులు విన్న స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు.
మరోవైపు బహుదూర్ మరింత రెచ్చిపోయి తన చిన్న కూతురి గొంతు కోయబోయాడు. అదే సమయంలో పోలీసులు వచ్చి ఆ పాపను రక్షించారు. ఈ పనిని దెయ్యమే చేయమని చెప్పిందని నిందితుడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ పాపను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద కుమార్తె చనిపోవడంతో బహదూర్ మానసికంగా కృంగిపోయి ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుమానిస్తున్నారు.