: పాకిస్థాన్ జర్నలిస్టుకి ఊహించని సమాధానం ఇచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్!


ఇంగ్లండ్ వేదికగా రేపటి నుంచి ఐసీసీ మహిళా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీనిని పురస్కరించుకుని ఐసీసీ అన్ని జట్ల కెప్టెన్లకు విందు ఏర్పాటు చేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా పాకిస్థాన్ కు చెందిన ఒక జర్నలిస్టు భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లలో మీకు ఎవరంటే ఇష్టం? అని అడిగారు. అంతే, మిథాలీరాజ్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. దీంతో వెంటనే అతనిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇలాంటి ప్రశ్న ఎవరైనా క్రికెటర్ ను అడగగలరా? అని ప్రశ్నించింది. 'రెండు దేశాలకు చెందిన ఏ క్రికెటర్ నైనా మీకు ఏ జట్టులోని మహిళా క్రికెటర్ ఇష్టమని ఏనాడైనా అడిగారా?' అంటూ నిలదీసింది.

'మీరెప్పుడూ మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని అడుగుతారు తప్ప మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని ఎందుకు అడగరు?' అని అడిగింది. దీంతో ఆ విలేకరి బిత్తరపోయాడు. ఊహించని ప్రశ్నలు ఎదురు కావడంతో చిన్నబోయాడు. రెండు దేశాల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయని పేర్కొంది. రెండు దేశాల్లో పురుషుల క్రికెట్ కు ఒకలాంటి ఆదరణ లభిస్తే, మహిళల క్రికెట్ కు మరో రకమైన ఆదరణ లభిస్తుందని తెలిపింది.

నిన్నమొన్నటి వరకు టీవీ ప్రసారాలు ఉండేవి కాదని, ఇప్పుడు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా లైవ్ లో మ్యాచ్ లను ప్రసారం చేస్తే, టీవీలలో కూడా వస్తున్నాయని, అయితే ఊహించని ఆదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయని మిథాలీరాజ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తుషార్ అరోద్ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో జట్టు మంచి ఫలితాలు సాధిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News