: ఇండోర్ లో ఘోరాతి ఘోరం... ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక 11 మంది మృతి
ఇండోర్ లోని ఎంవై హాస్పిటల్ లో నాటకీయ పరిణామాల మధ్య ఆక్సిజన్ నిలిచిపోవడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య 15 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఊపిరి ఆడక వీరంతా మరణించారు. కాగా, ఈ విషయం బయటకు పొక్కి మృతుల బంధువులు ఆందోళన చెందగా, పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఇటువంటి మరణాలు సహజమేనని ఆసుపత్రి యాజమాన్యం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని ఆసుపత్రి అటానమస్ బాడీ చైర్మన్ సంజయ్ దూబే తెలిపారు.
ఘటన వెనుక వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తెలియడం లేదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో నిత్యమూ 70 మందికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంటామని, సరఫరా ఆగిపోతే మిగతా వారు కూడా మరణించే ఉండాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, మరణించిన పేషంట్లకు సంబంధించిన లాగ్ బుక్స్, ఆక్సిజన్ సరఫరా రికార్డులు ఇప్పుడు ఆసుపత్రిలో కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ ఫైల్స్ చూపించాలని మీడియా కోరగా, యాజమాన్యం దాటవేత ధోరణిని ప్రదర్శించింది. రోగుల మరణాల తరువాత రికార్డులు మాయం అయ్యాయని, ఈ విషయం చాలా సేపటి వరకూ అతి కొద్ది మంది ఉన్నతాధికారుల మధ్యే ఉందని ఆసుప్రతి వర్గాలు వెల్లడించాయి.