: మాస్కో చలన చిత్రోత్సవంలో బాహుబలి 2: చాలా గర్వంగా ఉందన్న దర్శకుడు రాజమౌళి
భారతీయ సినిమా చరిత్ర రికార్డులను తిరగరాస్తూ సంచలన విజయం సాధించిన బాహుబలి-2 సినిమాను ఈ రోజు ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆ సినిమా దర్శకుడు రాజమౌళి తమకు ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి-2 ఈ రోజు ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమవుతుందని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి రష్యాలోనే ఉన్నారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆయన హాజరుకానున్నారు. రాజమౌళికి ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బాహుబలి-2 సినిమా ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన బాహుబలి-2 త్వరలోనే చైనాలోనూ విడుదల కానుంది.