: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉత్తరకొరియా సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉత్తరకొరియా సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి రెచ్చగొట్టింది. ట్రంప్‌ను ఓ ‘మానసిక రోగి’గా అభివర్ణించింది. ట్రంప్ ప్రస్తుతం కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారని, అమెరికా రాజకీయ సంక్షోభం నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే ఆయన తమ దేశంపై ఆరోపణలు చేస్తున్నారని ప్యాంగ్యాంగ్ అధికారిక రొడోంగ్ సిన్‌మున్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ట్రంప్ తీరుని దక్షిణకొరియా గ్రహించకపోయినట్లయితే పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
కొన్ని రోజుల క్రితం తమ దేశ చెర నుంచి విముక్తి పొందిన అమెరికా విద్యార్థి ఒటో వాంబియర్ మృతి చెందడంతో డొనాల్డ్ ట్రంప్ మానసిక రోగిగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న భాష దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జై ఇన్ లానే ఉందని పేర్కొంది. అమెరికాకు చెందిన ఒటో అనే విద్యార్థి ఉత్తరకొరియాకు వచ్చిన నేపథ్యంలో తన హోటల్ గోడపై ఉన్న ఒక రాజకీయ బ్యానర్‌ను తొలగించడంతో ఆయనను జనవరి 2016 లో అరెస్టు చేసి ఇటీవల విడుదల చేశారు. అయితే, ఆ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా క్రూరంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ వ్యాఖ్యలు చేసింది.