: మరోసారి నంబర్ వన్ ర్యాంకర్ ను మట్టి కరిపించిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్
సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ తన సత్తాను చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, దక్షిణ కొరియాకు చెందిన సన్ వాన్ పై 15-21, 21-13, 21-13 విజయం సాధించాడు. ఇటీవలే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకున్న శ్రీకాంత్, తన ఫామ్ ను కొనసాగిస్తుండటంపై బ్యాడ్మింటన్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియా ఓపెన్ లో సైతం సన్ వాన్ హోను శ్రీకాంత్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, మరో ఇండియన్ స్టార్ సాయి ప్రణీత్ సైతం ఆస్ట్రేలియా ఓపెన్ లో ముందంజ వేశాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో 21-15, 18-21, 21-13 తేడాతో చైనాకు చెందిన హువాంగ్ యుజియాంగ్ పై విజయం సాధించాడు.