: రాజధాని, శతాబ్దిల కోసం 'ఆపరేషన్ స్వర్ణ్'!


రాజధాని, శతాబ్ది... ఇండియాలో ప్రీమియం రైళ్లు. ఈ రైళ్లను ప్రారంభించినప్పుడు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని, ఇంకాస్త వేగంగా గమ్యానికి చేరుకోవచ్చని ప్రయాణికులు ఆనందించారు. మొదట్లో ఆ కోరిక నెరవేరినా, కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. మిగతా సాధారణ రైళ్లలో మాదిరిగానే ఈ రైళ్లలో కూడా పరిశుభ్రత లోపించింది. నాణ్యమైన ఆహారమూ లభించడం లేదు. దీంతో ఆదరణ తగ్గిపోగా, ఆక్యుపేషన్ రేషియో కుప్పకూలింది. రైలు సేవలు అసంతృప్తికరంగా మారాయని, సమయానుకూలత పాటించడం లేదని వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో, రైల్వే శాఖ స్పందించింది. రాజధాని, శతాబ్ది రైళ్లలో సేవలను మెరుగుపరిచేందుకు 'ఆపరేషన్ స్వర్ణ్' ను ప్రారంభించింది.

తొలి దశలో ముంబై - ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్, ముంబై - అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లను అప్ గ్రేడేషన్ కోసం సెలక్ట్ చేశామని, మిగతా రైళ్లను దశలవారీగా మారుస్తామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైలు ఆలస్యం కాకుండా చూడటం, పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం ప్రయాణికులకు లభ్యమయ్యేలా చూడటంపై ప్రత్యేక దృష్టిని సారించామని తెలిపారు. మొత్తం 10 కీలకాంశాల్లో మెరుగుదలను ప్రయాణికులు కోరుతున్నారని పేర్కొన్న ఆయన, సమయపాలన, పరిశుభ్రత, కోచ్ లోపలి వాతావరణం, టాయిలెట్లు, క్యాటరింగ్, అటెండెంట్ల ప్రవర్తన, భద్రత, వినోదం, హౌస్ కీపింగ్ తదితరాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రతి రైలుకూ రూ. 50 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News