: కర్ణాటకతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న క్రికెటర్ రాబిన్ ఊతప్ప
భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక నిర్ణయం తీసుకున్నాడు. కర్ణాటకతో తనకున్న 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. హోమ్ టీమ్ కు గుడ్ బై చెప్పి... రానున్న రంజీ సీజన్లో వేరే జట్టుకు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో, ఊతప్పకు కర్ణాటక క్రికెట్ సంఘం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ సందర్భంగా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి సుధాకర్ రావు మాట్లాడుతూ, ఊతప్ప తీసుకున్న నిర్ణయం బాధాకరమని చెప్పాడు. అండర్-14 స్థాయి నుంచి కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఊతప్ప... వేరే రాష్ట్రం తరపున ఆడేందుకు నిర్ణయించుకున్నాడని, అతని నిర్ణయానికి తాము అడ్డు చెప్పలేదని తెలిపాడు. ఊతప్ప ఏ జట్టుకు ఆడినా బాగా రాణించాలని కోరుకుంటున్నామని చెప్పాడు. అయితే ఊతప్ప ఏ రాష్ట్రం తరపున ఆడనున్నాడో ఇంకా వెల్లడించలేదు. కేరళ తరపున ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.