: జలియన్‌వాలా బాగ్‌లో దొంగలు పడ్డారు.. స్మారకంలోని నాణేలను ఏరుకుని పారిపోయారు!
జలియన్‌వాలా బాగ్.. ఈ పేరెత్తితో చాలు బ్రిటిష్ అధికారుల మారణకాండ కళ్లముందు కదలాడుతుంది. ఏప్రిల్ 13, 1919లో అందులో సమావేశమైన వందలాది మంది ప్రజలను జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు ఇంగ్లిష్ పోలీసులు పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేశారు. తప్పించుకునేందుకు మార్గం లేకుండా తలుపులకు గడియ పెట్టి మరీ కాల్పులు జరిపారు. దీంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల తూటాల నుంచి తప్పించుకునేందుకు కొందరు అందులోని బావిలోకి దూకారు.
తర్వాత ఆ బావి అమరవీరుల స్మారకంగా మారింది. రోజూ వందలాది మంది ఆ బావిని సందర్శిస్తుంటారు. బావిలోకి నాణేలు, నోట్లు విసురుతూ మృతవీరులకు గౌరవం సమర్పిస్తుంటారు. తాజాగా సోమవారం కొందరు దొంగలు జలియన్‌వాలా బాగ్ బావిలో దిగి సందర్శకులు విసిరే నాణేలు, నోట్లు దోచుకెళ్లారు. ఈ బావిలో దొంగతనం జరగడం ఇదే తొలిసారి. తాడు సాయంతో బావిలోకి దిగిన దొంగలు అందులోని నాణేలను ఏరుకుని వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బావికి ఉన్న కిటికీ మెష్ ద్వారా దొంగలు అందులోకి ప్రవేశించినట్టు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం ఇబ్బందిగా మారింది. కాగా, గత పదేళ్లుగా బావి నుంచి రూ.12,571 వెలికి తీశారు.