: జగన్ చుట్టూ ఎర్రచందనం, గంజాయి, లిక్కర్ మాఫియా ఉంది: మంత్రి జవహర్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ చుట్టూ ఎర్ర చందనం, గంజాయి, లిక్కర్ మాఫియా ఉందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ చుట్టూ పార్థసారధి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ చేరారని, అలీబాబా అరడజను దొంగల్లా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, దళితుడినైన తనకు ఎక్సైజ్ శాఖను అప్పగించడాన్ని చూసి వైఎస్సార్సీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, జగన్ దళిత ద్రోహి అని జవహర్ మండిపడ్డారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపిస్తే కనుక తన పదవులకు రాజీనామా చేస్తానని, నిరూపించలేని పక్షంలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలని జవహర్ డిమాండ్ చేశారు.