: చిరంజీవిని పిలవాలని మేము అనుకోలేదు.. అది ఒక రూమర్ మాత్రమే: అల్లు అర్జున్
తన కొత్త సినిమా ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ ఆడియో ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని తాము అనుకోలేదని.. అది ఒక రూమర్ మాత్రమేనని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. డీజే విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్ని మాట్లాడుతూ... దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి చెందడంతో తాము తమ సినిమాకు సంబంధించిన వారిని తప్పా బయటివారిని ఎవ్వరినీ పిలవలేదని చెప్పాడు. అందుకే ఆడియో ఫంక్షన్లో వేరే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు కనపడలేదని అన్నాడు.
దాసరి చనిపోయిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన వారంతా విషాదంలో ఉన్నారని అల్లు అర్జున్ అన్నాడు. అయితే, అదే సమయంలో తాము ఈ సినిమా ప్రమోషన్ కూడా మానుకోకూడదని అనుకున్నామని అన్నాడు. మరోవైపు దిల్ రాజు భార్య కూడా ఇటీవల మృతి చెందారని బన్ని గుర్తు చేశాడు. ఈ సినిమాను ఆమెకు అంకితం చేస్తున్నట్లు తాను ఆడియో ఫంక్షన్లో చెప్పానని అన్నాడు.