: అసభ్యంగా ప్రవర్తించిన బావ... బయటకు లాక్కొచ్చి చితక బాదిన మరదలు!
తాను కుక్కిన పేనులా పడి ఉండే అమ్మాయిని కాదని నిరూపించింది ఓ యువతి. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరినయినా సరే దండించి తీరుతానని తెలియజెప్పింది. యువతులంతా తనలా ఉండాలని, ఇంట్లో, ఆఫీసుల్లో వేధింపులు ఎదుర్కుంటూ కూర్చోకూడదని సందేశం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తన బావను వీధిలోకి ఈడ్చుకొట్టి చితక్కొట్టింది. ఆది పరాశక్తిలా ఆమె తనపై దాడి చేయడంతో ఏం చేయాలో తెలియక బిత్తరపోయాడు ఆ వ్యక్తి. అతడి చొక్కా పట్టుకొని ఇంట్లోంచి వీధిలోకి ఈడ్చుకొచ్చిన ఆ యువతి ఓ చోట కూర్చొబెట్టి నలుగురిలో తన బావను చావబాదింది. మరోసారి యువతిపై కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పింది. ఇంట్లో తనకు చేసిన అవమానాన్ని, తనపై లైంగిక దాడికి పాల్పడడానికి తన బావ చేసిన ప్రయత్నాన్ని ఆ మరదలు తనకు తగిలిన గాయాలే సాక్ష్యాలుగా అందరికీ చూపించింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు తీసిన వీడియోను జాతీయ ఛానెళ్లలో ప్రసారం చేశారు. ఆ యువతి ధైర్యాన్ని ప్రశంసించారు.