: విశాఖలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ ధర్నాలు... జగన్ కు అనుమతినిచ్చిన పోలీసులు, ఇంకా దరఖాస్తు చేయని టీడీపీ!
విశాఖపట్నం పరిసరాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై ఈ నెల 22న విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీలు పోటాపోటీ ధర్నాలు తలపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు మహాసంకల్పం పేరిట తెలుగుదేశం పార్టీ నిరసన, వివరణ సభను నిర్వహించనుండగా, అదే రోజు, అదే వేదికపై వైసీపీ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. తమ ధర్నాకు అనుమతులు ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకోగా, విశాఖ పోలీసులు వైకాపాకు అనుమతి ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పరిణామమే ఇప్పుడు టెన్షన్ కు కారణమైంది. కాగా, తాము చేపట్టిన మహాధర్నాను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని, శాంతి భద్రతలపై చిత్తశుద్ధి వుంటే మహా సంకల్పానికి అనుమతించకూడదని వైకాపా నేతలు హెచ్చరించారు. పోటీ ధర్నాలకు అనుమతి ఇస్తే, తదుపరి పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని, భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించేంత వరకూ తమ పోరాటం ఆగదని, వైకాపా విశాఖ నేత కోయ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొంటారని తెలిపారు.