: తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు: పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నాడు చెప్పిన కేసీఆర్ ఆ మాటలకు కట్టుబడలేదని, మోసం చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ జన్మదినోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ, దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్ ఎదిగారని అన్నారు. దేశ స్వాతంత్ర్య సాధన నుంచి ఇప్పటి వరకు గాంధీ, నెహ్రూల కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయని, దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని అన్నారు. కొన్ని రాజకీయ స్వార్థపరశక్తులు కాంగ్రెస్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని, కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు, ఆయన కుటుంబసభ్యులకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.