: కోహ్లీపై అడ్వైజరీ కమిటీ సభ్యులకు ఉన్న సందేహాలు ఇవే!
హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పట్ల టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. కుంబ్లేతో కలసి ఆడటం చాలా కష్టమని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన అడ్వైజరీ కమిటీకి కూడా కోహ్లీ తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అడ్వైజరీ కమిటీని కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. హెడ్ కోచ్ గా కుంబ్లే బాధ్యతలను నెరవేరుస్తున్నప్పటి నుంచి టీమిండియా ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. భారత క్రికెట్ టీమ్ ఎన్నో విజయాలను సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కుంబ్లే పర్ఫార్మెన్స్ ను ఎక్కడా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. మరి, కుంబ్లేను తొలగించడం ఎలా? హెడ్ కోచ్ ను తొలగించాలంటూ డిమాండ్ చేయడానికి కెప్టెన్ కు ఉన్న అధికారం ఏమిటి? ఒకవేళ కుంబ్లే స్థానంలో వేరొకరిని హెడ్ కోచ్ గా నియమించినా... అతనితో కోహ్లీ సర్దుకుపోతాడనే గ్యారంటీ ఏముంది? ఇలాంటి ప్రశ్నలు అడ్వైజరీ కమిటీని వేధిస్తున్నాయి. అడ్వైజరీ కమిటీలో ఉన్న ముగ్గురు దిగ్గజాలూ... కుంబ్లేకి మంచి మిత్రులు. వీరంతా కుంబ్లే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.