: లండన్ లో వ్యాన్ బీభత్సం... సెవెన్ సిస్టర్ రోడ్డు మూసివేత!
లండన్ మరోసారి భీతిల్లింది. లండన్ వంతెన వద్ద ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన ఘటన ఇంకా పూర్తిగా మరచిపోకముందే మరోసారి వ్యాన్ బీభత్సం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. లండన్ లోని ఫిన్స్ బరీ పార్క్ లోని సెవెన్ సిస్టర్ రోడ్డులోని మసీదు సమీపంలో పాదచారులపైకి రాత్రి 12.20 నిమిషాల సమయంలో ఒక వ్యాన్ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందగానే రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయ బృందాలు తమ పని ప్రారంభించాయి. సెవెన్ సిస్టర్ రోడ్డును మూసి వేశారు. ఘటనకు పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్లింలు రాత్రిపూట నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు.