: ఇంతవరకు నాన్న నాపై ఆ ఒక్కసారే కోప్పడ్డారు!: రాంచరణ్ తేజ్
టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి ఒకే ఒక్కసారి తనపై కోప్పడ్డారని 'మెగా పవర్ స్టార్' రాంచరణ్ తేజ్ అన్నాడు. రాజమండ్రి పరిసరాల్లో జరుగుతున్న 'రంగస్థలం' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాంచరణ్ తేజ్... తన జీవితంలో చోటుచేసుకున్న ఘటన గురించి, తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి ఫాదర్స్ డే సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి గొప్ప మనిషని అన్నాడు. ఆయనకు మహిళలంటే ఎంతో గౌరవమని అన్నాడు. అమ్మ అంటే మరీ ప్రేమ, ఆప్యాయత అని చెప్పాడు.
ఇక తన తల్లితో తనకు చాలా అనుబంధం ఉందని చెప్పాడు. తన ఆనందం, విచారం అన్నీ ఆమెతోనే పంచుకునే వాడినని, తామిద్దరం ఎంత ప్రేమగా ఉంటామో, అప్పుడప్పుడు అంతే స్థాయిలో గొడవ పడతాం, మాటామాటా విసురుకుంటామని చెప్పాడు. ఒకసారి అమ్మానాన్నతో కలిసి కూర్చుని మాట్లాడుకొంటున్నప్పుడు ‘వెళదాం పదరా’ అని ఆమ్మ అనగానే... ‘వెళ్దాంలే...కూర్చో’ అని ఎదురు చెప్పానని తెలిపాడు. అంతే, నాన్నకి కోపం వచ్చింది. ‘అమ్మరమ్మంటే...కూర్చో అని చెబుతావేంట్రా... అమ్మని అలా అనకూడదు’ అంటూ క్లాస్ పీకారని, అదే ఆయన తనపై కోప్పడిన సందర్భమని అన్నాడు. ఆయనకు కోపం సాధారణంగా రాదని, ఆయన పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారని రాంచరణ్ తెలిపాడు.