: ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. ఆపై డ్రామాలు ఆడిన వైనం
ఆ వివాహిత వయసు 32. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆమె 22 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ప్రియుడితో భర్తను చంపించింది. అనంతరం భర్త ఏటీఎం కార్డుతో రెండులక్షల రూపాయలు విత్ డ్రా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం కలిగించింది. ఎట్టకేలకు ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న తన భర్తను అన్యాయంగా ఆ వివాహిత చంపించిందని పోలీసులు చెప్పారు. తమ మధ్య వివాహేతర సంబంధానికి ఆయన అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని వివరించారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, పాల్వంచ మండలం సోములగూడెంలో సపావట్ శ్యామ్ (43) అనే వ్యక్తి కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు 13 ఏళ్ల క్రితం అంజనాపురం గ్రామానికి చెందిన శారదతో వివాహమైంది. వీరి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఇద్దరు కూతుళ్లు పుట్టారు. భార్యాపిల్లలు సోములగూడెంలో ఉంటుండగా శ్యామ్ తన ఉద్యోగం నిమిత్తం కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సోమిశెట్టి సాయికృష్ణ(22) అనే ఓ యువకుడితో శారద పరిచయం పెంచుకుంది.
వీరి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వేసవి సెలవులు ఉండడంతో ఆశ్రమ పాఠశాల నుంచి శ్యామ్ తన భార్యాపిలల్ల వద్దకు వచ్చాడు. దీంతో తన ప్రియుడిని కలుసుకునే అవకాశం లేకుండాపోతోందని శారద బాధపడిపోతోంది. దానికితోడు శారద తన భర్తతో తరుచూ గొడవ పడుతూ ఉండేది. దీంతో ఆమెకు తన ప్రియుడితో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. దీంతో శ్యామ్‌ను చంపేయాలని తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఆమె ప్రియుడు సాయికృష్ణ.. దారావత్ రాజు, సుజాత, దారావత్ సంతోష్ , కున్సోతు నరేష్ లతో ఈ విషయం చెప్పి, ఆయనను చంపేయాలని ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా చేసేయాలని అలా చేస్తే రెండులక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు.
అనంతరం శారద తన భర్తతో గొడవ పడింది. తమ గొడవకు ముగింపు పలకడానికి పెద్దల ముందుకు వెళదామని తన భర్తతో చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఆ అమాయక భర్త ఆమెను తీసుకొని బైకుపై పెద్దల వద్దకు బయలుదేరాడు. అయితే, మధ్యలో కొత్తగూడెం పట్టణంలోని గొల్లగూడెంలో తన బంధువులు ఉన్నారని ఆ ఇంటికి వెళదామని, అక్కడ కొద్దిసేపు ఉండి పెద్దల వద్దకు వెళ్దామని అతడి భార్య చెప్పింది. ఆ తరువాత ఆయనను ఆమె ఓ ఇంట్లోకి తీసుకెళ్లింది. అంతే ఆ ఇంట్లో మాటు వేసి ఉన్న సాయికృష్ణ, దారావత్ సంతోష్, కున్సోతు నరేష్ అతడి మెడను చున్నీతో బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో పడేశారు.
అనంతరం తన భర్త కనపడడం లేదని, ఇంటికి వెళ్లి శారద నాటకాలు ఆడింది. ఇల్లందులో శ్యామ్ బండి దిగిపోయాడని, అప్పటి నుంచి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదని అందరికీ చెప్పి నమ్మించింది. ఈ కేసులో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ఉపాధ్యాయుడి భార్యే ఈ పనిచేయించి డ్రామాలు ఆడిందని కనిపెట్టారు. తన భర్తను చంపిన తరువాత అతడి ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసింది. శారదతో పాటు ఆమె ప్రియుడు సోమిశెట్టి సాయికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య చేయడంలో వారికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరు మాత్రమే పరారీలో ఉన్నారని, మిగతా వారందరినీ పట్టుకున్నామని తెలిపారు.