: ఏకాభిప్రాయ సాధనలో... సోనియాతో వెంకయ్య, రాజ్ నాథ్ ల చర్చలు విఫలం
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే... తాము మద్దతు ఎలా ప్రకటిస్తామంటూ వెంకయ్య, రాజ్ నాథ్ లను సోనియా సూటిగా ప్రశ్నించారు.
చర్చల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండానే, ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం కోసం వారు వచ్చినట్టు లేదని, మద్దతు కోరడానికి వచ్చినట్టు ఉందని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు ముగ్గురు సభ్యులతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో రాజ్ నాథ్, వెంకయ్యలు ఉన్నారు.