: శిరీషపై ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేయలేదు: స్పష్టం చేసిన సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్‌లో సంచలనం కలిగిస్తోన్న బ్యూటీషియన్ శిరీష మృతి కేసు గురించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. శిరీష మృతి కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏడాది క్రితం రాజీవ్‌కు శ్రవణ్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజీవ్ తన కారులో శిరీష, శ్రవణ్‌లతో కలిసి కుకునూర్‌పల్లి వెళ్లారని చెప్పారు. కుకునూరు పల్లిలోని ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్‌కు వారు ముగ్గురూ వెళ్లి పార్టీ చేసుకున్నారని అన్నారు.
వారు ఎస్సై ప్రభాకర్ దగ్గరికి ముఖ్యంగా తేజస్విని విషయంపై చర్చించడానికి వెళ్లారని అన్నారు. రూంలో నలుగురూ కలిసి మద్యం తాగారని చెప్పారు. సిగరెట్ తాగడం కోసం రాజీవ్, శ్రవణ్ బయటకు వెళ్లిన సమయంలో రూంలోనే ఉన్న ప్రభాకర్ రెడ్డి శిరీషతో అసభ్యంగా ప్రవర్తించారని మహేందర్ రెడ్డి అన్నారు. తాను అలాంటిదాన్ని కాదని, శిరీష అభ్యంతరం వ్యక్తం చేసి, ఏడ్చిందని అన్నారు. అయితే, శిరీషపై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేయలేదని స్పష్టం చేశారు. తాను ఒక్కతే గదిలో మిగిలిపోయానని భయపడ్డ శిరీష తన భర్తకు లొకేషన్‌ను షేర్ చేసిందని అన్నారు.
ఈ ఘటనతో శిరీష్ తీవ్ర మనస్తాపం చెందిందని అన్నారు. రూంలో అరుపులు వినిపిస్తుండడంతో శ్రవణ్, రాజీవ్ రూం వద్దకు వచ్చి చూశారని అన్నారు. శిరీష్ అరుపులతో భయపడి పోయిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి అరవకూడదని చెప్పాడని అన్నారు. ఇంతలో రూంలోకి వచ్చిన రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను తెల్లవారు జామున 2.30 గంటలకు కారు ఎక్కించుకుని వెళ్లిపోయారని తెలిపారు.