: ఈ సండే 'బ్లాక్ బస్టర్ సండే': సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్లు!
ఈ సండే బ్లాక్ బస్టర్ సండే కానుందంటూ సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లండ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆ రోజు జరగనున్నాయి. ఇతర జట్లు ఏవైనా ఫైనల్ కి వచ్చి వుంటే అంతగా క్రేజ్ వుండేది కాదు. అయితే, దాయాదులు ఇండియా, పాక్ లు ఫైనల్స్ లో తలపడుతుండడంతో ఈ మ్యాచ్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. సాధారణంగా ఈ రెండు టీముల మధ్య మ్యాచ్ అంటేనే అది రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి 'యుద్ధం' అన్నట్టుగా వాతావరణం ఉద్రిక్తంగా మారిపోతుంది. పైగా ఇది ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోపీ కోసం పోరు! దీంతో ఆ రోజుకి ఓ ప్రత్యేకత వచ్చింది.
లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో, కసిగా ఆడి ఫైనల్ వరకు చేరింది. టోర్నీకి అవసరమైనట్టు సమర్థవంతంగా ఆడుతూ టీమిండియా ఫైనల్ లో అడుగుపెట్టింది. ఈ దశలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా మారుతుందని, బౌలింగ్ బలంతో ఫైనల్ చేరిన పాకిస్థాన్ జట్టు ఫైనల్ లో జూలు విదులుస్తుందని, ఛాంపియన్ ఆటతీరుతో టీమిండియా పాక్ ను మట్టికరిపిస్తుందని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ పై టైటిల్ పోరులో ఓడిపోతే పాక్ ఆటగాళ్లు స్వదేశంలో ఎలాంటి స్వాగతం ఎదుర్కోవాల్సి ఉంటుందో అందరికీ తెలిసిందేనని.... ఈ నేపధ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందు లాంటిదని భావిస్తున్నారు. దీంతో ఈ సండే బ్లాక్ బస్టర్ సండే కానుందని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.