: కారు డోర్ లాక్... ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న ఇద్దరు కవల చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీ సమీపంలోని గుడ్గావ్లో చోటుచేసుకుంది. ఈ చిన్నారుల తండ్రి సైన్యంలో పనిచేస్తూ మీరట్లో ఉంటున్నారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆ ఇద్దరు చిన్నారులు ఇలా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, గుడ్గావ్లోని పటౌడీ ప్రాంతంలోని తమ అమ్మమ్మ ఇంట్లో హర్ష, హర్షిత ఆడుకుంటున్నారు.
ఇంటి ముందు పార్క్ చేసిన కారుని చూసి అందులోకి వెళ్లారు. రెండు గంటల తరువాత హర్ష, హర్షిత కనిపించడం లేదని గమనించిన ఇంట్లోని వారు బయటకు వచ్చి చూడగా పార్క్ చేసి ఉంచిన ఆ కారులో ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారులు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఆ కారు పాతది కావడంతో చిన్నారులు అందులోకి ఎక్కిన తర్వాత లాక్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.