: కేసీఆర్ పాలనలో అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలను వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
మియాపూర్ లో సర్వే నంబర్లు 100, 104, 20, 28లోని భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు, కంపెనీలు సిద్ధమయ్యాయని... ఈ భూమి మార్కెట్ విలువ రూ. 15 వేల కోట్ల రూపాయలని... ప్రభుత్వ పెద్దల అండదండలతో వీటిని కాజేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఉత్తమ్ చెప్పారు. ఈ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి తన బినామీల పేరుతో రూ. 50 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసినట్టు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సదరు ఉప ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఇద్దరు అధికారులు సాక్షులుగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న భూ కబ్జాలపై గవర్నర్ నరసింహన్ కు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీలు ఈ రోజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాలపై పలు విషయాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో పని చేసే ఒక ఉన్నతాధికారి... మియాపూర్ భూ కుంభకోణంలో కీలక నిందితుడికి బంధువు అని ఉత్తమ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా తాము నిరూపించామని చెప్పారు. ఇదే విధంగా టీఆర్ఎస్ కీలక నేత కె.కేశవరావు ఇబ్రహీంపట్నంలో 50 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని... ఇప్పుడేమో ఆ భూమిని తాము వదిలేస్తామని చెబుతున్నారని... ఇది దేనికి సంకేతమని పశ్నించారు. అత్యంత విలువైన 50 ఎకరాల భూమిని ఎవరైనా వదులుకోవడానికి సిద్ధపడతారా? అని అడిగారు.
కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటంతో రంగంలోకి దిగిన కేసీఆర్... కుంభకోణాలను పక్కదోవ పట్టించేందుకు 72 మంది రిజిస్ట్రార్ లను ట్రాన్స్ ఫర్ చేశారని ఉత్తమ్ విమర్శించారు. తొలుత భూ కబ్జాను తామే బయటకు తెచ్చామని టీఆర్ఎస్ చెప్పుకుందని.. ఇప్పుడేమో ఏమీ జరగలేదని సీఎం అంటున్నారని... ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు, ప్రజలు గమనించాలని కోరారు. భూ కుంభకోణంపై సీఎం నిర్వహించిన సమీక్షలో నిజామాబాద్ ఎంపీ కవిత ఏ హోదాలో పాల్గొన్నారని ప్రశ్నించారు. ఈ వివాదాలతో ఆమెకున్న సంబంధం ఏమిటని అడిగారు. ఈ సమీక్షలో ఆమె పాల్గొనడంపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు జరిగాయనే అనుమానాలు తమకు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యేకు, మియాపూర్ భూ కబ్జాకు పాల్పడిన సంస్థకు మధ్య 10 ఎకరాల భూమికి సంబంధించి డెవలప్ మెంట్ అగ్రిమెంట్ జరిగిందా? లేదా? అని ప్రశ్నించారు. ఖమ్మం ఎమ్మెల్యేకు 11వేల గజాలు కట్టబెట్టారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూతురుకు హఫీజ్ పేట్ లో 4 ఎకరాలు రిజిస్టర్ చేశారా? లేదా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యుల బినామీ పేరుతో కూకట్ పల్లి సర్వే నంబర్ 163లో 4 ఎకరాలు రిజిస్టర్ అయిందా? లేదా? చెప్పాలని అడిగారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వంలోని పెద్ద మనుషులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.