: పని మనుషులపై అత్యాచారాల కేసులో శశికళ పుష్పకు బెయిల్ మంజూరు!


అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు మధురై హైకోర్టు బెంచ్ నిన్న బెయిల్ మంజూరు చేసింది. తన నివాసంలో పని చేసిన ఇద్దరు యువతులపై ఆమె భర్త, ఇతర కుటుంబీకులు అత్యాచార యత్నాలకు పాల్పడ్డారని, లైంగికంగా వేధించారంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ శశికళ పుష్ప, ఆమె బంధువులు తమను బెదిరించారంటూ బాధితురాలు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వీరిపై కేసు నమోదైంది.

ఈ కేసు విచారణ మధురై హైకోర్టు బెంచ్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం శశికళ పుష్ప గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన బెంచ్ ఈ నెల 14వ తేదీ వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయం ముగిసిపోవడంతో, నిన్న మరోమారు కేసును విచారించిన బెంచ్... శశికళ పుష్ప, ఆమె భర్త సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News