: జగన్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.. లోకేష్ కూడా సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే: రోజా
దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరకు హుద్ హుద్ తుపాను సమయంలో చేసిన సాయానికి సంబంధించిన రికార్డులను కూడా గల్లంతు చేశారని ఆరోపించారు. మొత్తం 233 గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని మాయం చేశారని చెప్పారు. భూ కబ్జాలపై సిట్ వేయడం పెద్ద డ్రామా అని రోజా అన్నారు. సిట్ అనేది ఓ కోరలు లేని పాము వంటిదని... దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. భూ వివాదాలపై సీబీఐ విచారణ అంటూ ముఖ్యమంత్రికి మంత్రి గంటా లేఖ రాయడం ముమ్మాటికీ మరో డ్రామానే అని మండిపడ్డారు. కేవలం భూ కబ్జాల వల్లే నారా లోకేష్ ఆస్తులు అమాంతం పెరిగాయని ఆరోపించారు. వివిధ కేసుల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారని... అదే విధంగా లోకేష్ కూడా సీబీఐ విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.