: 25 మంది కౌన్సిలర్లు, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచుల ఏకగ్రీవ నిర్ణయమిది: శిల్పా మోహన్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ నుంచి వచ్చి వైకాపాలో చేరిన శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే, తనకెంతో అభిమానమని, ఆయన దయతోనే తాను గతంలో ఎన్నికల్లో గెలిచానని శిల్పా గుర్తు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమారుడు జగన్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు.
తాను పార్టీ మారే నిర్ణయాన్ని నేతలు, కార్యకర్తలందరితో కలసి చర్చించి తీసుకున్నానని, 25 మంది కౌన్సిలర్లు, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచుల ఏకగ్రీవ నిర్ణయమిదని వెల్లడించారు. తన వెంట వచ్చిన వారంతా సొంతింటికి వచ్చినట్టుగానే భావిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి తానెంతో ఆనందంగా వచ్చానని శిల్పా చెప్పారు. తాను ఏ రోజూ సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, కానీ ఆయన మాత్రం నంద్యాలను, కర్నూలు జిల్లాను నిర్లక్ష్యం చేశారని అన్నారు. చివరగా 'జై జగన్, జై వైఎస్ఆర్ సీపీ' అంటూ శిల్పా తన ప్రసంగాన్ని ముగించారు.