: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు!
నిత్యమూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణంగా దసరా, సంక్రాంతి సీజన్ విపరీతమైన రద్దీ నెలకొని వుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, మొన్న సోమవారం నాడు సికింద్రాబాద్ డివిజన్ కొత్త రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 4,40,238 మంది స్టేషన్ కు వచ్చి, తమ తమ రైళ్లలో గమ్యస్థానాలకు వెళ్లారు. స్టేషన్ చరిత్రలో ఒకరోజు ప్రయాణికుల సంఖ్యలో ఇదే రికార్డని అధికారులు తెలిపారు. కాగా, సోమవారం నాడు పలు రైళ్లలో తనిఖీలు చేపట్టగా, 563 మంది టికెట్ లేకుండా ప్రయాణించారని, 886 మంది ఒక తరగతి టికెట్ కొని మరో తరగతిలో ప్రయాణిస్తూ పట్టుబడ్డారని, లగేజీ చార్జీలు కట్టకుండా 226 మంది దొరికిపోయారని, వీరి నుంచి రూ. 8. 2 లక్షలకుపైగా జరిమానా వసూలు చేశామని తెలిపారు.