: పోరాట యోధుడు యువరాజ్ సింగ్ 17 ఏళ్ల ప్రస్థానం... గొప్ప స్పూర్తినిచ్చే పాఠం!


టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గొప్ప స్పూర్తినిచ్చే పాఠమని పలువురు పేర్కొంటున్నారు. తన కెరీర్ లో 300వ మ్యాచ్ ఆడనున్న యువీ కెరీర్ ను వ్యక్తిత్వ వికాస పాఠంగా పేర్కొంటున్నారు. టీమిండియాలో దిగ్గజ ఆటగాళ్లు సీకే నాయుడు, విజయ్ హజారే, విజయ్ మర్చంట్, సుభాష్ గుప్తా, బిషన్ సింగ్ బేడీ, గుండప్ప విశ్వనాథ్, విను మన్కడ్, ఎర్రపల్లి ప్రసన్న, మోహీందర్ అమర్ నాథ్, నవాబ్ పటౌడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్ సర్కార్, మహమ్మద్ అజహరుద్దీన్ లకు భిన్నంగా... సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్, సెహ్వాగ్ సమకాలీనుడిగా ఘనమైన కెరీర్ తో క్రికెట్ చరిత్రలో పంజాబీ పుత్తర్ యువరాజ్ సింగ్ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్, ఆఫ్ స్పిన్నర్ గా కెరీర్ ఆరంభించిన యువీ ఆల్ రౌండర్ గా తిరుగులేని ఎన్నో ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్ గెలవడంలో యువీ ఎలాంటి పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 17 ఏళ్ల క్రితం అల్లరి చిల్లర అబ్బాయిగా, జల్సా రాయుడిగా, దూకుడైన మనస్తత్వం కలిగిన కుర్రాడిగా యువీ ఎన్నోసార్లు వివాదాల్లో కూరుకుపోయాడు. మైదానం బయట ఎన్నోసార్లు యువీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ప్రేమ వ్యవహారాలు కూడా అతనిని వార్తల్లో నిలిచేలా చేశాయి. అలాంటి యువీకి సుదీర్ఘ కెరీర్ ఉంటుందని ఎవరూ నమ్మలేదు. అయితే కేవలం తనపై తనకున్న విశ్వాసం, అంకితభావం, అంతులేని శ్రమ, ఉడుంలాంటి పట్టుదల, తలవంచని పోరాటతత్వంతో తిరుగులేని కెరీర్ ను నిర్మించుకున్నాడు. కెరీర్ పాతాళంలోకి పడిపోయిన ప్రతిసారీ ఉత్తుంగ తరంగమై పైకి లేచాడు. ప్రపంచ క్రికెట్‌లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనతలను యువీ సొంతం చేసుకున్నాడు.

పదేళ్ల సుదీర్ఘ కెరీర్ తరువాత వరుస వైఫల్యాలతో 2010లో తొలిసారి జట్టులో స్థానం కోల్పోయాడు. ఏడాది తిరక్కుండానే మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌ లో అద్భుత ప్రదర్శన చేస్తుండగా ఆరంభంలోనే కేన్సర్ సోకిందని తేలింది. చెన్నైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మూడు సార్లు మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. కేన్సర్ బారిన పడిన శరీరం ఏమాత్రం సహకరించడం లేదు. అయితే మరణించాల్సి వస్తే మైదానంలోనే చనిపోతానని నిర్ణయించుకుని టోర్నీ మొత్తం ఆడాడు. కేవలం ఆడడం మాత్రమే కాదు... నాలుగు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లు, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'తో సత్తాచాటాడు. అనంతరం కేన్సర్ కి చికిత్స చేయించుకున్నాడు. తరువాత జట్టులోకి వచ్చి 2013లో ఫామ్‌ కోల్పోవడం, ఫిట్‌ నెస్‌ లేకపోవడంతో జట్టులో మళ్లీ స్థానం కోల్పోయాడు. ఈ దశలో అతనికి ‘జాలి’తో అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

దీంతో ఫ్రాన్స్‌ వెళ్లాడు, నిపుణులైన అత్యుత్తమ ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చాడు. మళ్లీ జట్టులో స్థానం పొందాడు. అదే ఏడాది చివర్లో మళ్లీ పేలవ ప్రదర్శనతో జట్టులో మరోసారి స్థానం కోల్పోయాడు. ఇక యువీ పని సరి...రిటైర్ కావాల్సిందేనంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ దశలో దేశవాళీ క్రికెట్ లో చెలరేగి ఆడిన యువీ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడుతాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూడగా, పాక్ పై అర్ధ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ అతనికి 300వ వన్డే అవుతుంది. ఈ సారి ఏం చేస్తాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News