: 14.5 ఓవర్లకు లంక స్కోరు 282/2... పీసీబీ చేసిన నిర్వాకానికి నెటిజన్ల అక్షింతలు!
చాంపియన్స్ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్ లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడగా, పాకిస్థాన్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్న పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 15వ ఓవర్ ఐదవ బంతికి హసన్ అలీ చేతిలో అవుట్ కాగా, అప్పటికి లంక స్కోరు 2 వికెట్ల నష్టానికి 282 పరుగులని ప్రకటించింది.
ఈ మేరకు పీసీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ను ఉంచగా, అది వైరల్ అయింది. అప్పటికి లంక స్కోరు 82 పరుగులు మాత్రమే. దీన్ని చూసిన పలువురు క్రీడాభిమానులు పీసీబీ నిర్లక్ష్యంపై తిట్లకు దిగారు. ఇది వారి డొల్లతనానికి నిదర్శనమని, మ్యాచ్ పై వారి అశ్రద్ధను ఎత్తి చూపుతోందని పలువురు పాకిస్థానీలు విమర్శలు గుప్పించారు. అసలు 15 ఓవర్లకే 282 పరుగులు సాధించడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు సంధించారు. అంత గుడ్డిగా ఎలా ట్వీట్లు పెడతారని మండిపడ్డారు. పీసీబీ పరువు తీశారని నిప్పులు చెరిగారు. ఇన్ని విమర్శలు వస్తున్నా ఈ ట్వీట్ ను ఇంకా తొలగించకపోవడం గమనార్హం.