: చింపిరి జుట్టుతో వచ్చిందని పదేళ్ల చిన్నారితో 200 గుంజీలు తీయించిన టీచర్... బాలిక పరిస్థితి విషమం!
అహ్మదాబాద్ లో ఓ టీచర్ చేసిన నిర్వాకం పదేళ్ల బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. చింపిరి జుట్టుతో వచ్చిందన్న కారణాన్ని చూపుతూ మణినగర్ లోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాల టీచర్, ఓ బాలికకు 200 గుంజీల శిక్షను విధించగా, గంటపాటు లేస్తూ, కూర్చుంటూ ఉండిపోయిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. రెండు కాళ్లూ వాచిపోయి, లేచి నిలబడే పరిస్థితిలో లేని తమ కుమార్తె స్థితిని చూసి ఆమె తల్లిదండ్రులు చలించిపోయారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా విద్యాధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన లలితా గ్రీన్ లాన్స్ స్కూల్ లో జరిగిందని విద్యాధికారి ప్రజాపతి వెల్లడించారు. బాలిక 5వ తరగతి చదువుతోందని, గత కొన్ని రోజులుగా రెండు జడలతో రావాలని టీచర్ చెబుతుండగా, ఆమె పోనీటెయిల్ తో వస్తోందని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన విన్నీ బెన్ అనే టీచర్, ఆమెను స్కూలు ట్రస్టీ రూములోకి తీసుకెళ్లి, ఓ పీరియడ్ పాటు గుంజీలు తీయాలని శిక్ష విధించారని, ఆ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయని తెలిపారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నట్టు వివరించారు.