: భర్త, కుమారుడిని వదిలేసి.. తీవ్రవాదిని రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన మహిళ అరెస్ట్!
ఇంటర్నెట్ లో వీడియోలు, వార్తలు చూస్తూ తీవ్రవాదం పట్ల ఆకర్షితురాలైన సింగపూర్ యువతిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, సింగపూర్ కు చెందిన సైఖా ఇజ్జత్ జాహ్రా అల్ అన్సారీ (22) అనే యువతికి పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆమె తీవ్రవాదం పట్ల ఆకర్షితురాలైంది. దీంతో తన భర్తను, కుమారుడిని వదిలేసి సిరియా వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. అక్కడకు వెళ్లి, ఓ తీవ్రవాదిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే, ఈ విషయాన్ని సింగపూర్ పోలీసులు గుర్తించి, ఆమెను అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించింది. తనకు హింస, తీవ్రవాద కార్యకలాపాలంటే చాలా ఇష్టమని చెప్పింది. అందుకే సిరియాకు వెళ్లి, ఓ ఐసిస్ ఉగ్రవాదిని రెండో పెళ్లి చేసుకుని, వారితోనే కలసి పని చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఈ సందర్బంగా సింగపూర్ ఇస్లామిక్ మత సంస్థ మాట్లాడుతూ, తీవ్రవాదం వైపు యువత మొగ్గు చూపకూడదని కోరింది. సోషల్ మీడియా వల్ల యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపింది.