: రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం బీజేపీ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులతో కూడిన కమిటీని సోమవారం ప్రకటించింది. దీనికి బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఎన్డీఏ తరపున నామినీని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలను కలిసి రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం చర్చిస్తుంది.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఎన్డీఏ నామినీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయాన్ని బీజేపీ తేల్చుకోలేకపోతోంది. అలాగే తాము నిలబెట్టే అభ్యర్థికి టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని బీజేపీ భావిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడి రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తోందని బీజేపీ పేర్కొంది. రాష్ట్రపతి అభ్యర్థి నామినీ కోసం శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసినా.. ఎన్డీఏ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కమిటీ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.