: భార్యాభర్తల వాగ్వాదం... వెంటనే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న దంపతులు!
అతను ఆర్టీలో డ్రైవర్. వచ్చే డబ్బులు చాలక పోవడంతో విధులు ముగించుకున్న తరువాత ఆటో నడపాలని భార్య ఒత్తిడి చేస్తుండగా, వాగ్వాదం పెరిగి ఇద్దరూ పోటీపడి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నారు. ఈ ఘటన విజయవాడ పరిధిలోని విద్యాధరపురం వెనుక రామాలయం సమీపంలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. పిల్లల చదువుకు సంపాదన సరిపోవడం లేదని, ఖాళీ సమయంలో ఆటో నడపాలని భార్య లలితాదేవి తన భర్తపై ఒత్తిడి తెస్తుండేది.
ఈ నేపథ్యంలో విధులు నిర్వహించుకుని వచ్చిన భర్తపై మరోసారి వాగ్వాదానికి దిగింది. తాను ఆటో నడిపేది లేదని శ్రీనివాసరావు తెగేసి చెప్పడంతో, ఇక తాను బతకలేనని చెబుతూ, వంటగదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుంది. తాను కూడా మరణిస్తానని అంటూ శ్రీనివాసరావు కూడా కిరోసిన్ పోసుకున్నాడు. లలితాదేవి వెలిగించిన అగ్గిపుల్ల ఇద్దరికీ అంటుకోవడంతో, ఆ దంపతులు కేకలు పెట్టారు. బయటన్న పిల్లలు, చుట్టుపక్కల వారు వచ్చేవరకే వారు మంటల్లో కనిపించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి వారిని తరలించగా, ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.