: నన్నింక కొనసాగించవద్దు: మోదీకి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ విన్నపం
జూన్ 19తో భారత అటార్నీ జనరల్ గా తన మూడళ్ల పదవీ కాలాన్ని ముగించుకోనున్న ముకుల్ రోహత్గీ, తనకు ఎలాంటి పొడిగింపు లేదా మరో విడత బాధ్యతలు వద్దని మోదీ ప్రభుత్వాన్ని కోరారు. తనను అటార్నీ జనరల్ గా తిరిగి నియమించే ఆలోచన వద్దని తాను ప్రభుత్వాన్ని గత నెలలోనే కోరినట్టు పీటీఐకి ఆయన వెల్లడించారు. ఆ పదవిలో కొనసాగాలని తనకు లేదని, తదుపరి తాను ప్రైవేటుగా ప్రాక్టీసును కొనసాగిస్తానని తెలిపారు. కాగా, కొత్త అటార్నీ జనరల్ ను ఎంపిక చేసేంత వరకూ రోహత్గీ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా పర్యటనలో ఉన్న వేళ ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మే 2014లోనే రోహత్గీని అటార్నీ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడగా, ప్రభుత్వంతో సత్సంబంధాలు నడిపిన ఆయన, పలు కేసుల్లో న్యాయ సలహాలు అందించడమే కాకుండా, కోర్టుల్లో కేంద్రం తరఫున వాదనలు వినిపించారు.