: సినారే మృతిపై చంద్రబాబు, జగన్, బాలకృష్ణ, లోకేష్ సంతాపం
ప్రముఖ కవి, గేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ, జ్ఞానపీఠ్ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారే అని కొనియాడారు. ఎన్టీఆర్ తో సినారే ఎంత సన్నిహితంగా ఉండేవారో తనకు తెలుసునని చెప్పారు. రచయితగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. సినారే పాటలు ఆణిముత్యాలని కొనియాడారు.
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల స్పందిస్తూ, ఆయన మరణం బాధాకరమని, సినారే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఆయన మృతి వార్త దిగ్బ్రాంతిని కలిగించిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, తెలుగు సాహిత్య లోకానికి ఆయన పెద్ద దిక్కని కొనియాడారు. తెలుగు భాషకు, ముఖ్యంగా సినీలోకానికి సినారే మృతి తీరని లోటని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. హోం మంత్రి చినరాజప్ప, పరకాల ప్రభాకర్ తదితర ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపాలు వెలిబుచ్చారు.