: నిజాంపేట్ లో బాలిక మిస్సింగ్... పోలీసుల సెర్చింగ్!
హైదరాబాదులోని నిజాంపేట్ కు చెందిన బాలిక పూర్ణిమ సాయి (13) మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈ నెల 7న స్కూల్ కు వెళ్లి తిరిగిరాని పూర్ణిమ కోసం కుటుంబ సభ్యులు ఆరాతీస్తున్నారు. అపార్ట్ మెంట్ సీసీ టీవీ పుటేజ్ లో పూర్ణిమ సాయి స్కూల్ యూనిఫాంలో గంతులేసుకుంటూ స్కూల్ కు వెళ్లడం కనిపిస్తోంది. అయితే పది గంటల సమయంలో స్కూల్ వాళ్లు పూర్ణిమ సాయి తల్లికి ఫోన్ చేయగా, వంటగదిలో ఉన్న ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఒంటి గంటకు పాప వస్తుందని ఎదురు చూసిన ఆమె పాప రాకపోవడంతో స్కూల్ కి వెళ్లింది.
దీంతో వాళ్లు తాము పాప స్కూల్ కి ఎందుకు రాలేదని ప్రశ్నించేందుకు ఫోన్ చేశామని, అయితే ఎవరూ లిఫ్ట్ చేయలేదని తెలిపారు. దీంతో స్కూల్ లోని ఆమె స్నేహితులను ఆరాతీయగా వారు కూడా పూర్ణిమ స్కూల్ కు రాలేదని తెలపడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు 14 టీమ్ లు ఏర్పాటు చేసి పాపకోసం వెతుకుతున్నారు.