: 16 నుంచి పెట్రోలు కొనబోము... తెగేసి చెప్పిన బంకుల యాజమాన్యం


ఈ నెల 16 నుంచి రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలను మార్చే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెట్రోలు బంకుల యాజమాన్యాలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. జూన్ 16 నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి పెట్రోలును కొనుగోలు చేయబోమని, బంకులు మూసేసేందుకైనా సిద్ధమేకానీ, నిత్యమూ మారే ధరలను అమలు చేయలేమని తేల్చి చెప్పాయి. ఈ విధానం ఇప్పట్లో ఎంతమాత్రమూ సహేతుకం కాదని, దీన్ని అమలు చేసే విధానం లేదని, 16 తరువాత స్టాక్స్ ఎప్పుడు ముగిస్తే అప్పుడు బంకులను మూసివేస్తామని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 57 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయని, వీటిల్లో 53 వేల వరకూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచే పెట్రోలు, డీజిల్, సహజ వాయువులను కొనుగోలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. 15 రోజులకోసారి ధరలను సవరించే విధానాన్నే తాము అంగీకరిస్తున్నామని ఆయన అన్నారు. డీలర్ కమిషన్ ను ప్రస్తుతమున్న 2 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

కాగా, గత నెల 1 నుంచి ఐదు నగరాల్లో రోజువారీ ధరల విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రం, 16 నుంచి దేశవ్యాప్తంగా ఇదే తరహా విధానం తీసుకు వస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో 4 వేల వరకూ ఎస్సార్, రిలయన్స్ పెట్రోలు బంకులుండగా, మిగతా బంకుల యాజమాన్యాలు పట్టు వీడకుంటే, వీటిపై మరింత ఒత్తిడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News